తెలంగాణలో బీజేపీకి అధికారం రావడం కల..అమిత్ షా ఎన్నిసార్లు తిరిగినా వృథానే: మంత్రి సీతక్క

తెలంగాణలో బీజేపీకి అధికారం రావడం కల..అమిత్ షా ఎన్నిసార్లు తిరిగినా వృథానే: మంత్రి సీతక్క

హైదరాబాద్, వెలుగు: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నిసార్లు పర్యటించినా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం కేవలం కల అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. సోమవారం సెక్రటేరియెట్‌‌‌‌లో మీడియాతో చిట్‌‌‌‌చాట్ చేశారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలు, బీజేపీ వైఖరిపై మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ అగ్రనేతలు తెలంగాణపై ఎన్ని ఆశలు పెట్టుకున్నా, ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చి ప్రచారం చేసినా రాష్ట్ర ప్రజలు వారిని ఆదరించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఎన్ని వ్యూహాలు పన్నినా, నాయకులు ఎన్నిసార్లు రాష్ట్ర పర్యటనలు పెట్టుకున్నా తెలంగాణ గడ్డపై బీజేపీ అధికారంలోకి రావడం ఎప్పటికీ సాధ్యం కాదన్నారు.

.దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ సభ ఏ విధంగా జరిగిందో యావత్ దేశం ప్రత్యక్షంగా చూసిందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఆ సభను అడ్డుకునేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నించిందని, ఎన్ని ఇబ్బందులు సృష్టించినప్పటికీ సభ అపూర్వ ప్రజాదరణతో గ్రాండ్ సక్సెస్ అయిందని వెల్లడించారు. విజయవంతమైన సభను బీజేపీ నాయకులు ‘ఫ్లాప్ షో’ అని విమర్శించడం  సిగ్గుచేటన్నారు. సభ విజయవంతంతో బీజేపీ నేతల్లో తీవ్ర భయం, నిరాశ మొదలయ్యాయని, ఆ అక్కసుతోనే ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు.